Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

శుభాకాంక్షలు

సాహిత్యాభిమానులకు పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

12, డిసెంబర్ 2015, శనివారం

మన తెలుగు వైభవం

ఆంధ్రము, తెలుగు, తెనుగు  మూడు పదాల మూలాలూ, వాని మధ్య సంబంధాలు గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి[7][8]. క్రీ.పూ.700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము (ఋగ్వేదములో భాగము) లో మొదటిసారిగా "ఆంధ్ర" అనే పదం జాతి పరంగా వాడబడింది. కనుక ఇదే మనకు తెలిసినంతలో ప్రాచీన ప్రస్తావన. ఆ తరువాత బౌద్ధ శాసనాలలోనూ, అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది. క్రీ.పూ. 4వ శతాబ్దిలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి ఆంధ్రులు గొప్ప సైనికబలం ఉన్నవారని వర్ణించినాడు.
ఆంధ్రులు మాట్లాడే భాషకు ఆంధ్రము, తెలుగు, తెనుగు అనే పేర్లున్నాయి. ఆంధ్ర, తెలుగు అనేవి రెండు వేర్వేరు జాతులనీ అవి క్రమంగా మిళితమైనాయన్న కొంతమంది అభిప్రాయానికి జన్యు శాస్త్ర పరంగా కానీ భాషాశాస్త్ర పరంగా కానీ గట్టి ఆధారాలు దొరకలేదు. వైదిక వాఙ్మయం ప్రకారం ఆంధ్రులు సాహసోపేతమైన సంచారజాతి. భాషాశాస్త్ర పరంగా తెలుగు గోదావరి, కృష్ణా నదుల మధ్య నివసిస్తున్న స్థిరనివాసుల భాష. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాన్ని ఆంధ్ర రాజులు ముందుగా పరిపాలించడం వల్ల ఆంధ్ర, తెలుగు అన్న పదాలు సమానార్థకాలుగా మారిపోయాయని కొంతమంది ఊహాగానం. 10 వ శతాబ్దపు పారశీక చరిత్రకారుడు అల్ బిరుని తెలుగు భాషను 'ఆంధ్రీ' యని వర్ణించెను [9].
క్రీ.శ. 1000 కు ముందు శాసనాలలోగాని, వాఙ్మయంలో గాని తెలుగు అనే శబ్దం మనకు కానరాదు. 11వ శతాబ్దము ఆరంభమునుండి 'తెలుంగు భూపాలురు', 'తెల్గరమారి', 'తెలింగకులకాల', 'తెలుంగ నాడొళగణ మాధవికెఱియ' వంటి పదాలు శాసనాల్లో వాడబడ్డాయి. 11వ శతాబ్దములో నన్నయ భట్టారకుని కాలమునాటికి తెలుగు రూపాంతరముగా "తెనుగు" అనే పదము వచ్చినది. 13వ శతాబ్దములో మహమ్మదీయ చారిత్రకులు ఈ దేశమును "త్రిలింగ్" అని వ్యవహరించారు. 15వ శతాబ్దము పూర్వభాగంలో విన్నకోట పెద్దన్న తన కావ్యాలంకారచూడామణి లో ఇలా చెప్పాడు.
ధర శ్రీ పర్వత కాళే
శ్వర దాక్షారామ సంజ్ఙ వఱలు త్రిలింగా
కరమగుట నంధ్రదేశం
బరుదారఁ ద్రిలింగదేశ మనఁజనుఁ గృతులన్
తత్త్రిలింగ పదము తద్భవంబగుటచేఁ
దెలుఁగు దేశ మనఁగఁ దేటపడియె
వెనకఁ దెనుఁగు దేశమును నండ్రు కొందరు
శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం - అనే మూడు శివలింగక్షేత్రాల మధ్య భాగము త్రిలింగదేశమనీ, "త్రిలింగ" పదము "తెలుగు" గా పరిణామము పొందినదనీ ఒక సమర్థన. ఇది గంభీరత కొరకు సంస్కృతీకరింపబడిన పదమేననీ, తెలుగు అనేదే ప్రాచీన రూపమనీ చరిత్రకారుల అభిప్రాయము. చాలామంది భాషావేత్తలు, చరిత్రకారులు ఈ వాదనలు పరిశీలించి దీనిలో నిజంలేదని అభిప్రాయపడ్డారు. అందుకు నన్నయ మహాభారతంలో త్రిలింగ శబ్దం ప్రయోగం కాకపోవడం కూడా కారణమన్నారు.[10] 12వ శతాబ్ధిలో పాల్కురికి సోమనాధుడు "నవలక్ష తెలుంగు" - అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు దేశము - అని వర్ణించాడు. మొత్తానికి ఇలా తెలుగు, తెనుగు, ఆంధ్ర - అనే పదాలు భాషకూ, జాతికీ పర్యాయ పదాలుగా రూపు దిద్దుకొన్నాయి.

మాండలికాలు

తెలుగుకు నాలుగు ప్రధానమైన మాండలిక భాషలున్నాయి.
  1. సాగరాంధ్ర భాష : కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలలోని భాషను కోస్తా మాండలికం లేదా సాగరాంధ్ర మాండలికం అంటారు.
  2. రాయలసీమ భాష : చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల ప్రాంతపు భాషను రాయలసీమ మాండలికం అంటారు.
  3. తెలంగాణ భాష : తెలంగాణ ప్రాంతపు భాషను తెలంగాణ మాండలికం అంటారు.
  4. కళింగాంధ్ర భాష : విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాషను కళింగాంధ్ర మాండలికం అంటారు.
తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించింది. అశోకుని కాలములో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. అశోకుడి కాలానికి చెందిన బ్రాహ్మి లిపి రూపాంతరమైన భట్టిప్రోలు లిపి నుంచి తెలుగు లిపి ఉద్భవించింది[5].
తెలుగు లిపిని బౌద్ధులు, వర్తకులు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు అందచేసారు. అక్కడ ఈ లిపి, మాన్, బర్మీస్, థాయ్, ఖ్మేర్, కామ్, జావనీస్, మరియు బాలినీస్ భాషల లిపుల ఉద్భవానికి కారకమయ్యింది. తెలుగు లిపి తో వాటికి స్పష్టంగా పోలికలు కనిపిస్తాయి. తెలుగు అక్షరమాల చూడడానికి దాని సమీప దాయాదియైన కన్నడ అక్షరమాల వలెనే కనిపిస్తుంది.
తెలుగు లిపి పరిణామము మౌర్యుల కాలము నుండి రాయల యుగము దాకా
తెలుగు లిపి చాలవరకు ఉచ్చరించగల ఏకాక్షరాలతో ఉండి, ఎడమనుండి కుడికి, సరళమైన, సంక్లిష్టమైన అక్షరాల సరళితో కూడి ఉంటుంది. ఈ విధమైన ఉచ్చరించగల ఏకాక్షరాలు అనేకంగా ఉండడానికి ఆస్కారం ఉన్నందువల్ల, అక్షరాలు "అచ్చులు" ( వొవెల్స్ లేదా స్వర్ ) మరియు "హల్లులు" ( కాన్సొనెంట్స్ లేదా వ్యంజన్ ) అన్న ప్రధానమైన ప్రమాణాలను కలిగి ఉన్నాయి. హల్లుల రూపు వాటి వాడుకను బట్టి, సందర్భానుసారము మార్పు చెందుతూ ఉంటుంది. అచ్చుల ధ్వని వాటిలో లేనప్పుడు హల్లులు పరిశుద్ధమైనవిగా పరిగణించబడతాయి. అయితే, హల్లులను వ్రాయడానికీ , చదవడానికీ, అచ్చు "అ" ను చేర్చడం సాంప్రదాయకం. హల్లులు వేర్వేరు అచ్చులతో చేరినప్పుడు, అచ్చుఅంశం వర్ణ పరిచ్ఛేదముతో "మాత్రలు" అన్నసంకేతాలను ఉపయోగించడంతో గుర్తింపబడుతుంది. ఈ "మాత్రల" ఆకారాలు తమ తమ హల్లుల ఆకారాలకు ఎంతో విరుద్ధంగా ఉంటాయి. తెలుగులో ఒక వాక్యం "పూర్ణవిరామం" తో కానీ, "దీర్ఘవిరామం" తో కానీ ముగించబడుతుంది. అంకెలను గుర్తించడానికి తెలుగులో ప్రత్యేకంగా సంకేతాలున్నా, అరబిక్ అంకెలే విస్తృతంగానూ, సర్వసాధారణంగానూ ఉపయోగింపబడుతున్నాయి. ఈ విధంగా, తెలుగులో, 16 అచ్చులు, 3 విశేషఅచ్చులు, 41 హల్లులు చేరి మొత్తం 60 సంకేతాలు కలవు.

తెలుగు అంకెలు

పేరు తెలుగుసంఖ్య ఇండో అరబిక్ అంకెలు
సున్నా 0 0
ఒకటి 1
రెండు 2
మూడు 3
నాలుగు 4
ఐదు 5
ఆరు 6
ఏడు 7
ఎనిమిది 8
తొమ్మిది 9
తెలుగు అంకెలు, సంఖ్యలు తెలుగు కేలెండర్ లో ప్రధానంగా వాడుతారు. ఇతరత్రా ఇండో అరబిక్ రూపాలనే వాడుతారు

తెలుగు సాహిత్యం

తెలుగు సాహిత్యాన్ని ఆరు యుగాలుగా వర్గీకరించ వచ్చును.

క్రీ.శ. 1020 వరకు - నన్నయకు ముందు కాలం

11 వ శతాబ్దం ప్రాంతంలో నన్నయ రచించిన మహాభారతం తెలుగు లోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు. ఒక్కసారిగా ఇంత బృహత్తరమైన, పరిపక్వత గల కావ్యం రూపుదిద్దుకోవడం ఊహించరానిది. కనుక అంతకు ముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి. కాని అది బహుశా గ్రంథస్తం కాలేదు. లేదా మనకు లభించడం లేదు. అంతకు ముందు సాహిత్యం ఎక్కువగా జానపద సాహిత్యం రూపంలో ఉండి ఉండే అవకాశం ఉన్నది. కాని మనకు లభించే ఆధారాలు దాదాపు శూన్యం. క్రీ.శ. 575లో రేనాటి చోడుల శాసనం మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం. ఇది కడప జిల్లా కమలాపురం తాలూకా ఎఱ్ఱగుడిపాడులో లభించినది. అంతకు ముందు కాలానికి చెందిన అమరావతీ శాసనంలో "నాగబు" అనే పదం కన్పిస్తుంది.

1020-1400 - పురాణ యుగము

దీనిని నన్నయ్య యుగము అనవచ్చును. నన్నయ్య ఆది కవి. ఇతడు మహా భారతాన్ని తెలుగులో వ్రాయనారంభించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని(అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషుడు అయ్యాడు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచినాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించినారు; తెనుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి, పండితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ, నారాయణులు యుగపురుషులు. వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య అడుగు జాడలను అనుసరించిన వారే.
నన్నయ తరువాతికాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటు చేసుకొన్నాయి. వీరశైవము, భక్తిమార్గము ప్రబలమై ఎన్నో కావ్యాలకు కారణమైనది. తిక్కన (13వ శతాబ్ది), ఎర్రన(14వ శతాబ్దం) లు భారతాంధ్రీకరణను కొనసాగించారు. నన్నయ చూపిన మార్గంలో ఎందరో కవులు పద్యకావ్యాలను మనకు అందించారు. ఇవి అధికంగా పురాణాలు ఆధారంగా వ్రాయబడ్డాయి.

1400-1510 -మధ్య యుగము (శ్రీనాథుని యుగము )

ఈ కాలంలో సంస్కృతకావ్యాల, నాటకాల అనువాదం కొనసాగింది. కథాపరమైన కావ్యాలు కూడా వెలువడ్డాయి. "ప్రబంధము" అనే కావ్య ప్రక్రియ ఈ కాలంలోనే రూపు దిద్దుకున్నది. ఈ కాలంలో శ్రీనాథుడు, పోతన, జక్కన, గౌరన పేరెన్నిక గన్న కవులు. ఛందస్సు మరింత పరిణతి చెందింది. శ్రీనాథుని శృంగార నైషధము, పోతన భాగవతం, జక్కన విక్రమార్క చరిత్ర, తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం మొదలైనవి ఈ యుగంలో కొన్ని ముఖ్యమైన కావ్యాలు.
ఈ సందర్భంలో రామాయణ కవులగురించి కూడా చెప్పకోవచ్చును. గోన బుద్దారెడ్డి రచించిన రంగనాథ రామాయణము మనకు అందిన మొదటి రామాయణం.

1510-1600 - ప్రబంధ యుగము

విజయనగర చారిత్రకశకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16 వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది.స్వతహాగా కవియైన మహారాజు తన ఆముక్తమాల్యద తో "ప్రబంధం" అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాల తో ఆయన ఆస్థానం శోభిల్లింది.

1600-1820 - దాక్షిణాత్య యుగము

కర్ణాటక సంగీతపు ప్రముఖులెంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితా లోనివే త్యాగరాజు, అన్నమాచార్య, క్షేత్రయ్య రామదాసు(కంచెర్ల గోపన్న) వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగు నే ఎంచుకొన్నారు.

1820 తరువాత - ఆధునిక యుగము

1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లోనే సాధ్యమయింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో, షెల్లీ, కీట్స్, వర్డ్స్వర్త్ వంటి కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు "భావకవిత్వం" అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు.
గ్రాంథిక, వ్యావహారిక భాషా వాదాలు
నన్నయకు పూర్వమునుండి గ్రాంథిక భాష మరియు వ్యావహారిక భాష స్వతంత్రముగా పరిణామము చెందుతూ వచ్చాయి. కానీ 20 వ శతాబ్దము తొలి నాళ్లలో వీటి మధ్య ఉన్న వ్యత్యాసాలు తీవ్ర వాదోపవాదాలకు దారితీసాయి]. గ్రాంథికము ప్రమాణ భాష అని, స్థిరమైన భాష అని, దాన్ని మార్చగూడదని గ్రాంథిక భాషా వర్గము, ప్రజల భాషనే గ్రంథ రచనలో ఉపయోగించాలని వ్యావహారిక భాషా వర్గము వాదించడముతో తెలుగు పండితలోకము రెండుగా చీలినది.
మొట్టమొదటి నవలగా పరిగణించబడుతున్న కందుకూరి వీరేశలింగం రచన రాజశేఖరచరిత్రము తో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గ్రాంథిక భాష వాడకాన్ని తీవ్రంగా నిరసిస్తూ గిడుగు రామ్మూర్తి ప్రకటించిన ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం ప్రభావంతో గురజాడ అప్పారావు (ముత్యాల సరాలు), కట్టమంచి రామలింగారెడ్డి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకుడు) (ముసలమ్మ మరణం), రాయప్రోలు సుబ్బారావు (తృణకంకణం) మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యావహారిక భాషను వాడడం వ్యావహారిక భాషా వాదా నికి దారితీసింది.
19 వ శతాబ్దం వరకూ తెలుగు రచనలు గ్రాంథిక భాషలోనే సాగినాయి, కానీ తరువాత వాడుక భాషలో రచనలకు ప్రాముఖ్యత పెరిగినది. ప్రస్తుతం రచనలు, పత్రికలు, రేడియో, దూరదర్శిని, సినిమాలు మొదలైనవన్నీ కూడా వాడుక భాషనే వాడుతున్నాయి.

తెలుగు పరిశోధన

కొన్ని తెలుగు పరిశోధనల సిద్ధాంత పుస్తకాలు ఇన్ఫర్మేషన్ మరియు లైబ్రరీ నెట్ వారి జాలస్థలి లో అందుబాటులోవున్నాయి

ఇతర రాష్ట్రాలలో తెలుగు

తెలుగు ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ లోనే కాకుండా తమిళనాడు, కర్నాటక, ఒడిశా లలో కూడా మాట్లాడబడుతుంది. తమిళనాడు లో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 42 శాతం తెలుగువారే.బెంగళూరు లో 30 % మంది తెలుగు భాష మాట్లాడువారు నివసించుచున్నారు. తమిళనాడులోని హోసూరు, కోయంబత్తూరులలో, ఒడిశా లోని రాయగడలో కూడా తెలుగు భాష ఎక్కువ. విజయనగర సామ్రాజ్య కాలములో తెలుగు వారు వేల మంది తమిళప్రాంతములకు వెళ్ళి స్థిరపడ్డారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక మంది తెలుగువారు కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుండి వలస వెళ్లి తమిళనాడులో స్థిరపడ్డారు. కాని వారి రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రాంతీయ భాష అయిన అరవము లోనే మాట్లాడుతుంటారు. అలాగే కర్నాటక లో కూడా చాలామంది తెలుగు మాట్లాడగలరు. ఇంకా ఒడిశా, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర లోని కొన్ని సరిహద్ధు ప్రాంతాలలోని ప్రజలు అధికంగా తెలుగే మాట్లాడుతారు. దక్షిణాదిలో ప్రముఖ నగరాలైన చెన్నై, బెంగళూరు లలో కూడా తెలుగు తెలిసినవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇక ఇతర రాష్ట్రాలలో మరియు ఇతర దేశాలలో స్థిరపడిన తెలుగు వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రింది ప్రాంతాలలో తెలుగు భాష ఎక్కువ గా మాట్లాడువారు నివసించుచున్నారు 1. బెంగళూరు 2. చెన్నై 3. హోసూరు 4. కోయంబత్తూరు 5. మధురై (తమిళనాడు) 6. బళ్ళారి 7. రాయగడ 8. హుబ్లి 9. వారణాసి (కాశి) 10. శిరిడి 11. జగదల్పూర్ 12. బరంపురం, ఒడిశా 13. ఖరగ్ పూర్, పశ్చిమ బెంగాల్ 14. షోలాపూర్ 15. సూరత్ 16. ముంబై -భివాండి 17. ఛత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతాలు 18. ఒడిశా సరిహద్దు ప్రాంతాలు